Ola Electric Bikes: రూ.499కే ఓలా ఎలక్ట్రిక్ బైక్

Ola Electric Bikes: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించింది. కస్టమర్లు olaelectric.com వేదికగా ఆన్లైన్లో వీటిని బుక్ చేసుకోవచ్చు. కేవలం రూ.499 చెల్లించి బుక్ చేసుకోవచ్చని సంస్థ సీఈఓ భావిష్ అగర్వాల్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పెట్రోల్ ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో వాహనదారులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. చాలామంది సొంత వాహనాలను పక్కకి పెట్టి ఆటోలు, బస్సులను ఆశ్రయిస్తున్నారు. మరికొంత మంది పెట్రోల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్ లో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు, కార్లు దూసుకెళ్లనున్నాయి. ఈ రేసులో క్యాబ్ సర్వీసెస్ అగ్రిగేటర్ ఓలా మరో అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ బైక్ ప్రియులకు శుభవార్తను అందించింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించింది. వినియోగదారులు తమ ఓలా స్కూటర్‌ను కేవలం రూ.499 డిపాజిట్ చేసి రిజర్వు చేసుకోవచ్చని తెలిపారు. కస్టమర్లు olaelectric.com వేదికగా ఆన్లైన్లో వీటిని బుక్ చేసుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భావిష్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా తమ ఈ-స్కూటర్ల బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి నిర్ధష్టమైన ధరలను వెల్లడిస్తామని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భావిష్ అగర్వాల్ తెలిపారు. బుకింగ్ ధర రూ. 499 చెల్లిస్తే డెలివరీ సమయంలో మిగతా మొత్తం చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఎలక్ట్రికల్ వెహికల్ రవాణా రంగంలో పోటీ ఎక్కువగా ఉంది. అయినా ఆ పోటీని తట్టుకొని త్వరలోనే ప్రపంచంలోనే నంబర్ స్థానంలో నిలబడే సామర్థం ఓలా సంస్థ వద్ద ఉందని.. ఇటువంటి సంస్థకు నాయకత్వం వహించడం గర్వంగా ఉందని ఓలా చైర్మన్ & గ్రూప్ సీఈఓ భావిష్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పరిధిలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఫ్యాక్టరీని ఓలా ఎలక్ట్రిక్ స్థాపించింది. దాదాపు 500 ఎకరాల్లో దీనిని స్థాపించారు. దేశీయ మార్కెట్ డిమాండ్‌తోపాటు ఆసియా, యూరప్, సౌత్ అమెరికా మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా ఏటా 20 లక్షల స్కూటర్ల తయారీ సామర్థ్యం ఈ ప్లాంట్ లక్ష్యం. తొలి ఏడాదిలో 10 లక్షల స్కూటర్లు విక్రయించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది.