Entertainment
Trending

Sridevi Birth Anniversary: సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలిగిన అతిలోక సుందరి

Sridevi Birth Anniversary చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అతిలోక సుందరి అనే పదానికి అసలైన నిర్వచనంలా ఉంటూ ఎన్నో ఏళ్ల పాటు సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలిగిన ధృవతార శ్రీదేవి. అప్పటి కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా వెలుగొందిన ఆమె.. కొన్ని కోట్ల మంది అభిమానాన్ని అందుకున్నారు. చిన్న వయసు నుంచే నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టి సుదీర్ఘ కాలం పాటు దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ తన హవాను చూపించారు. తద్వారా ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటిగా గుర్తింపును అందుకున్నారు

అదే సమయంలో ఎన్నో అవార్డులు, రివార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. సినీ రంగంపై ఇంతటి ప్రభావాన్ని చూపించిన ఈ అందాల సుందరాంగి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమె జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటన గురించి తెలుసుకుందాం పదండి!

చిన్న వయసులోనే నటిగా ప్రయాణం

1963 సంవత్సరంలో శ్రీదేవి తమిళనాడులోని శివకాశిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. 1967లో అంటే నాలుగేళ్ల వయసులోనే ‘కంధన్ కరుణై’ అనే తమిళ చిత్రంలో బాలనటిగా నటించారు. ఆ తర్వాత తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో చిత్రాల్లో పని చేశారు. ఈ క్రమంలోనే నందమూరి తారక రామారావు నటించిన ‘బడి పంతులు’ సినిమాలో సైతం శ్రీదేవి నటించారు. ఇందులో ఆయన మనవరాలి పాత్రను పోషించారు. అలా దాదాపు దక్షిణాదిలోని అన్ని భాషల్లో బాలనటిగా నటించి.. చిన్న వయసులోనే తన స్టామినాను ఇండియన్ సినిమాకు పరిచయం చేసుకున్నారు.

హీరోయిన్‌గా ప్రయాణం మొదలైందిలా

1976లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘మూండ్రూ మూడిచ్చు’ అనే తమిళ చిత్రంతో శ్రీదేవి హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీని తర్వాత ఈమె రజినీకాంత్, కమల్ హాసన్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ తర్వాత మిగిలిన భాషల్లోనూ ఎంట్రీ ఇచ్చి తన సత్తాను నిరూపించుకున్నారు. దీంతో శ్రీదేవి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టేంతగా ఈ లెజెండరీ హీరోయిన్ బిజీ అయిపోయారు. అలా సుదీర్ఘ కాలం పాటు ఆమె తన ప్రయాణాన్ని విజయవంతంగా సాగించుకున్నారు.

తెలుగులోకి ఎంట్రీ.. సీనియర్ హీరోలు

1977లో వచ్చిన ‘బంగారక్క’ అనే సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు శ్రీదేవి. దీని తర్వాత చేసిన ‘పదహారేళ్ల వయసు’తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఏకంగా స్టార్ హీరోలు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర్రావు, కృష్ణ, శోభన్ బాబులతో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. తద్వారా తెలుగులోనూ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయారు. బడి పంతులు చిత్రంలో ఎన్టీఆర్‌కు మనవరాలిగా నటించిన శ్రీదేవి.. ఆ తర్వాత ఆయన నటించిన ‘వేటగాడు’, ‘బొబ్బిలి పులి’ సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించడం విశేషం.

అప్పటి స్టార్ హీరోలు.. ఒక్కడితో లేదు

మొదటి తరం హీరోలైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర్రావు, కృష్ణ, శోభన్ బాబుల చిత్రాల్లో నటించిన శ్రీదేవి.. ఆ తర్వాత తరం స్టార్లు మెగాస్టార్ చిరంజీవి, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్‌తోనూ పలు చిత్రాల్లో నటించారు. వీటిలో చిరంజీవితో చేసిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, వెంకీతో చేసిన ‘క్షణ క్షణం’ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అప్పటి హీరోల్లో నందమూరి బాలకృష్ణతో మాత్రమే శ్రీదేవి నటించలేదు. అయితే, ‘సింహం నవ్వింది’ అనే సినిమాలో ఆమె ఎన్టీఆర్‌కు జోడీగా చేయగా.. బాలయ్య అందులో కీలక పాత్ర చేశాడు.

అవార్డులు… ఘనతలు… రికార్డులతో

సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో శ్రీదేవి ఎన్నో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. బాలనటిగానే ఉత్తమ నటనతో పలు అవార్డులు గెలుచుకున్న ఆమె.. ఆ తర్వాత హీరోయిన్‌గానూ ఫిల్మ్‌ఫేర్, నంది సహా పలు అవార్డులు దక్కాయి. అలాగే, ప్రభుత్వం తరపున పలు పురస్కారాలు కూడా వచ్చాయి. అంతేకాదు, తన సినీ కెరీర్‌లో శ్రీదేవి ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసి సత్తా చాటారు. ఇలా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ రంగానికి విశేషమైన సేవలు చేశారామె

ప్రేమ పెళ్లి… ఇద్దరు పిల్లలు.. పుకార్లు

దక్షిణాదిలోని అన్ని భాషల్లో తన హవాను చూపించిన శ్రీదేవి.. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టారు. అక్కడ కూడా స్టార్ హీరోలతో కలిసి నటించారు. ఇలా సుదీర్ఘమైన కెరీర్‌లో ఆమె ఎంతో మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీదేవి లవ్ ట్రాకుల గురించి ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్‌ను ఆమె పెళ్లాడారు. అంతకు ముందే ఆయనకు భార్య ఉండగా.. ఆమెను వదిలేసి శ్రీదేవిని చేసుకున్నారు. ఇక, వీళ్లకు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు అమ్మాయిలు జన్మించారు.

రీఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే మరణం

దాదాపు నలభై ఏళ్ల పాటు సినీ వినీలాకాశంలో తన అందంతో మెరిసిపోయిన శ్రీదేవి.. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దాదాపుగా దూరం అయ్యారు. ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరోయిన్ 2012లో వచ్చి విజయవంతమైన కామెడీ డ్రామా ‘ఇంగ్లీష్ వింగ్లిష్‌’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె తన 300వ చిత్రం మామ్‌లో నటించారు. ఈ రెండు చిత్రాల్లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇలా మళ్లీ ప్రేక్షకులను అలరిస్తోన్న సమయంలోనే 2018లో శ్రీదేవి కన్నుమూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button